నెహ్రూపై సంచలన ఆరోపణలు

జనరల్‌ నాలెడ్జి పరీక్ష పేరుతో బీజేపీ యువవిభాగం నిర్వహించిన పరీక్ష కాస్త వివాదానికి తెరలేపింది. అందులో అడిగిన ప్రశ్నలు ప్రతిపక్షాలకు మంటపెట్టేలా ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మంగళవారం సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి నేపథ్యంలో బీజేవైఎం(భారతీయ జనతా యువ మోర్చా) విభాగం ఓ జనరల్‌ నాలెడ్జి పరీక్ష నిర్వహించింది. భోపాల్‌లోని ఎంవీఎం కాలేజ్‌ క్యాంపస్‌లో ఈ పరీక్ష ఏర్పాటుచేయగా అంతకుముందు ‘మేరే దీన్‌ దయాళ్‌’ అనే పేరుతో ఉన్న పుస్తకాన్ని పరీక్ష రాసే వారికి అందించారు.

అందులో మాజీ ప్రధాని జవహార్‌ లాల్‌పై వారు సంచలన ఆరోపణలు చేశారు. నెహ్రూకు అధికారంపై వ్యామోహం అని పేర్కొన్నారు. అందుకోసమే దేశాన్ని విడదీస్తున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. అదే సమయంలో పాకిస్థాన్‌ పిత మహ్మద్‌ అలీ జిన్నా కూడా అలాంటి వ్యక్తేనని పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని 47వ పేజీలో అఖండ్‌ భారత్‌ అనే చాప్టర్‌లో ‘ఎలాంటి విభజన లేకుండానే భారత్‌కు స్వాతంత్ర్యం వస్తుందని దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ నమ్మారు. కానీ, తమకు అధికారం దక్కాలనే దురాశతో అవిభక్త భారతదేశానికే స్వాతంత్ర్యం అనే ఆలోచనను పక్కన పడేసి నెహ్రూ, జిన్నాలు బ్రిటీష్‌ వాళ్ల వ్యూహంలో పడ్డారు’ అని పేర్కొన్నారు.

అంతేకాకుండా జీకే పరీక్ష కోసం కూర్చున్నవారికి ఇచ్చిన ప్రశ్నా పత్రంలో కేవలం దీన్‌ దయాళ్‌కు సంబంధించినవి 4 ప్రశ్నలు అలాగే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తీసుకొచ్చిన 11 పాలసీల మీద మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ పరీక్షపై పెద్ద స్థాయిలో విమర్శలు వచ్చాయి. కాగా, దీన్‌ దయాళ్‌ గురించి నేటి తరానికి తెలియాలనే ఉద్దేశంతోనే తాము ఆ పరీక్ష పెట్టామే తప్ప దురుద్దేశంతో కాదని అన్నారు.

 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!