అసలు సమస్య రాజ్యాంగంలోనే ఉంది

స్వతంత్ర భారతదేశానిది ఏడు దశాబ్దాల చరిత్ర. ఈ ఏడు దశాబ్దాల కాలంలో చెలరేగిన మతఘర్షణలు, సామాజిక అలజడులు, కులఘర్షణలు, వర్గ విబేధాలన్నింటికీ మూలం భారత రాజ్యాంగమే.
 
ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగం అని చెప్పుకోవడంలో ఔచిత్యం కనిపించదు. రాజ్యాంగం గొప్పదనం అది రాసిన వ్యక్తుల వల్ల, అందులో పొందుపరచబడిన ఆర్టికల్స్, భారీతనం వల్ల రాదు. ప్రజలందరికీ వర్తించేలా, ప్రజలందరినీ సంతృప్తిపరచి, ఇది నాది అనుకునేలా చేయగలిగినదే అసలు సిసలైన రాజ్యాంగం. కానీ మన దేశ రాజ్యాంగ కమిటీ ఏమి చేసిందో, ఎటువంటి అతుకులబొంతను తయారుచేసిందో అర్ధం చేసుకోవాలంటే బ్రిటిష్ వాడు 1935లో తయారుచేసిన Act of India చూస్తే చాలు. ఆరోజుల్లో భారతదేశ ప్రజలను విభజించటానికి, తన ఆధిపత్యం కొనసాగించటానికి బ్రిటిష్ వాడు ఎత్తుగడులుగా ఆ చట్టంలో ఏర్పరచిన వాటిని యధాతధంగా ఎత్తిరాసి అదే గొప్ప రాజ్యాంగం అని గొప్పచెప్పుకున్నారు . 
భారత రాజ్యాంగంలోని “వుయ్, ది పీపుల్ ఆఫ్ ఇండియా” అనే ఒక్క పదంలో తక్కించి మిగిలోన చోట్ల ఎక్కడా “భారతీయులంతా ఒక్కటే” అనే స్పష్టత ఇచ్చే అంశం ఉండదు. ఆ తర్వాత వచ్చేవన్నీ భారతీయ సమాజాన్ని వీలైనంత చీలికలు పీలికలు చేసేటటువంటి ప్రతిపాదనలే. 1947 నాటికి భారతీయుల్లో ఉన్న భారతీయత స్ఫూర్తిని 1950 నాటికి గణతంత్ర దినోత్సవం సాక్షిగా భూస్థాపితం చేశారు. 
స్వతంత్ర సమరంలో అన్ని సామాజిక విభేదాలనూ మరచిపోయి దేశమాత దాస్యశృంఖలాలను తెంచేందుకు భారతీయులందరూ కలిసికట్టుగా కృషిచేశారు. ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదాలు భారతదేశమంతటా మారుమ్రోగాయి. ఎవ్వరూ ఆ నినాదాలకు అభ్యంతరం పెట్టలేదు. దేశవిభజన జరిగింది. మతమే ముఖ్యమనుకున్న వాళ్ళు పాకిస్థాన్ కు వెళ్లిపోయారు. భారతీయతలోనే తమకు భద్రత ఉందనుకున్నవారు భారతదేశంలో ఉండిపోయారు.  తామంతా భారతీయులమే అనుకున్నారు. అందుకు సాక్ష్యం రాజ్యాంగ సభలో ‘మైనారిటీ విద్యాసంస్థల హక్కులు’ మీద జరిగిన చర్చలో పాల్గొన్న ఒక ముస్లిం యొక్క ఆవేదనాభరిత ప్రసంగం.
“మేము భారతీయులుగా ఇక్కడ ఉండిపోయాం. భారతీయులుగా బ్రతకాలనుకుంటున్నాం. కానీ మీరేమిటి మమ్మల్ని మైనారిటీలంటారు? మేము భారతీయులుగా జీవించవద్దా?” అంటూ ఆయన ప్రశ్నించారు.కానీ ఆ ఆవేదనను అర్ధంచేసుకోలేకపోయింది రాజ్యాంగ సభ, దానిలోని అధిక శాతం సభ్యులైన కాంగ్రెస్ వాళ్లు. 
ఎంత అర్ధరహిత రాజ్యాంగం తయారుచేయాలో అలా తయారుచేశారు. భారతీయతలోనే సెక్యులరిజం ఉందని రాజ్యాంగ సభ నమ్మింది. కానీ జవహర్ లాల్ నెహ్రూ బృందం అతితెలివిగా భారతీయులను విడగొట్టే ఆర్టికల్స్ జాతచేసింది. ఎవరి మతానికి వారి చట్టాలను అనుమతించి, సెక్యులర్ పునాది ఏర్పరచడానికి వీలులేకుండా చేశాడు నెహ్రూ. భవనం శంకుస్థాపన నాడే బలహీన పునాది వేసినవాడు నెహ్రూ.
భారత రాజ్యాంగంలో భారతీయత లేదు. అందరూ భారతీయుల్ని పైపైకి ప్రస్తావిస్తూ అంతర్గతంగా మీరు హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, ఇంకా ఇంకా ఎన్ని రకాలుగా  విడగొట్టదలచుకుంటే అన్నిరకాలుగా విడగొట్టే ఆర్టికల్స్ రాజ్యాంగంలోకి చొప్పించాడు . 
దేశం ఒకటి కాదనీ, దేశప్రజలందరూ ఒకటి కాదని రాజ్యాంగమే చెప్తుంటే ఇక ప్రజలను చీల్చేవారు, రెచ్చగొట్టేవారు తమపని తాము చేశారు. జవహర్ లాల్ నెహ్రూ రాజకీయ వారసురాలు మరో చతురత ప్రదర్శించింది. నాటి వరకు దేశం సెక్యులర్ కానట్టుగా రాజ్యాంగంలోని ప్రియాంబుల్ లో ‘సెక్యులర్’ అనే పదం చొప్పించి సమాజాన్ని మరింతగా మతపరంగా చీల్చి, తన ఓటుబ్యాంకుని పెంచుకునే యత్నం విజయవంతంగా చేసింది. 
ఇప్పుడు దేశంలో ఉన్న సమస్యలన్నింటికీ మూలం రాజ్యాంగంలో ఉన్న అనిర్వచనీయమైన రెండు పదాలు. అందులో ఒకటి మైనారిటీ, రెండవది సెక్యులరిజం. ఆ రెండు పదాలు ఒకదానితో ఒకటి పొసగనివి. 
సెక్యులర్ అంటే మతాతీత రాజ్యం అని అర్ధం. అంటే మతానికి, ప్రభుత్వానికీ సంబంధం లేదు. ప్రజల్లో ఏ మతాన్నీ అనుసరించనివారు ఉండవచ్చు. నాస్తికులు ఉండవచ్చు. ఎవరి విశ్వాసాలు వారివి. కానీ అందరూ భారతీయులు. భారతీయులందరికీ వర్తించే చట్టం ఒక్కటే, అటువంటి చట్టం ఒకటి తేవాలని ఆర్టికల్ ద్వారా భారత రాజ్యాంగం కోరింది. నేటివరకు మనదేశంలో భారతీయ చట్టాలు తీసుకురాలేకపోయారు. 
సెక్యులర్ దేశంలో అందరూ భారతీయులే అయినప్పుడు ఇక మెజారిటీ, మైనారిటీ అనే పదాలకు అర్ధంలేదు. అసలు మైనారిటీ అనే పదానికి సరైన నిర్వచనం రాజ్యాంగంలో లేదు. మరి మైనారిటీలనే పదం మాత్రం దేశమంతటా వినిపిస్తోంది. మరి మైనరిటీలను ఎలా నిర్వచించాలి? ఆ విషయంలో రాజ్యాంగం మౌనం. ఇది అదనుగా చూసుకుని మతపరమైన మైనారిటీ, భాషాపరమైన మైనారిటీ, కులపరమైన మైనారిటీ.. ఇలా ఎవరికి ఏది అనుకూలం అనిపిస్తే ఆ మైనారిటీగా విభజించుకుంటూ సాగుతున్నది రాజకీయం.  
అందుకే నేడు అసలుసిసలు భారతీయత లేదు. దేశంలో భారతీయులుగా భావించుకునేవారు లేరు. విభేదించుకునేవారు కోకొల్లలుగా ఉన్నారు. ఇదీ మన రాజ్యాంగం అనే మెడిపండు. దీనిని చూసి గర్వించాల్సిందేమీ లేదు. కనీసం ఈ గణతంత్ర రోజైనా కుల మతాలకు అతీతంగా ఎదుగుతున్న యువత భారత రాజ్యాంగం వైపు సవ్యమైన దృక్కోణంతో చూడాల్సిన పనుంది.

డా. దుగ్గరాజు శ్రీనివాసరావు

రచయిత ప్రముఖ రాజకీయ విశ్లేషకులు

2 thoughts on “అసలు సమస్య రాజ్యాంగంలోనే ఉంది

 • 26/01/2018 at 3:12 pm
  Permalink

  జై హిందూ.. గొప్పగా చెప్పారు👏💪

  Reply
 • 28/03/2018 at 1:21 pm
  Permalink

  నెహ్రూ ఒక్కరిపేరే వ్రాసారేమి! వేరే వారి పేరు వ్రాస్తే కేసు పెడతారనా!? ఇది ద్వంద్వ ప్రమాణం కాదా! చట్టబద్ధం అయిన ఆధునిక వర్ణవ్యవస్థ గురించి కూడా ప్రస్తావించి ఉంటె బాగుండేది.

  Reply

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!