“భావి భారతం”

యువత అధికంగా ఉన్న దేశం. మానవ వనరులకు ఆలవాలమైన దేశం. అయినా యుక్త వయస్సులోనే వొంగిపోయిన భుజాలు సత్తువ లేని బుద్ధికి సాక్ష్యంగా మారింది. ఈ పాశ్చాత్య సంస్కృతి విష బీజాలను మనసుల్లో నాటుకుంటే దేశ భవిష్యత్తు వృక్షం కూడా విషాన్నే నింపుకుంటుంది కదా..!!
 
మన సంస్కృతిలో పుట్టి పెరుగుతారు కానీ అదంటే రుచించదు. ఇలాంటి ఆలోచన నుండే మొదలవుతుంది మన తిరోగమనం. ఎంతో పరిపక్వత కలిగినవారం మేము అని చెప్పుకుంటూ తిరిగే ఈనాటి యువతరం నిజానికి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఈ మట్టి విలువ మన సంస్కృతి సంప్రదాయాల విలువ తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆచరించడమే మన నిజమైన అభివృద్ధి.
 
కానీ అందుకు విరుద్ధంగానే జరుగుతోంది అంతా.
 
విజ్ఞానం మరియు నాగరికత పేరుతో ఎటు వైపుకి వెళ్తున్నామో కూడా తెలియకుండా అడుగులేస్తోంది యువత. ఈనాటి పరిస్థితులు వారు ఆచరిస్తోన్న పద్ధతులు గమనిస్తే మనకీ విషయం అర్థం అవుతుంది. ప్రేమ పేరుతో పెడదోవలు పట్టడం; తల్లిదండ్రులకు విలువ ఇవ్వకపోవడం; సాంప్రదాయాలకు తిలోదకాలు వదలడం; చెడు అలవాట్లతో పరిష్వంగం; చెడు లక్షణాలకు లొంగడం; బాధ్యతారాహిత్యంతో మెలగడం; జీవితంలో సరైన లక్ష్యాలు లేకపోవడం – ఇవి ఈనాటి యువత ప్రధాన లక్షణాలు. ఇలాంటి వారి మూలకంగా దేశం ముందుకు వెళ్ళడం దాదాపు అసాధ్యం.
 
ఇక తల్లిదండ్రుల పాత్ర విషయానికొస్తే పిల్లలు వీరి ప్రతిబింబాలు. వీరెలా మెలిగితే సంతానమూ అలాగే ప్రవర్తిస్తారు. వారు పిల్లల కోరికలకు, కాంక్షలకు ఇచ్చిన ప్రాధాన్యత ధర్మానికీ దేశానికీ ఇవ్వడం లేదు. చిన్నతనంలోనే మన ధర్మంలో ఉన్న చక్కటి విషయాలు తెలుసుకొని పిల్లలకు తెలియజేయడం ఈనాటి తల్లిదండ్రులు చేయడం లేదు. అంతేకాదు తమ పిల్లలను సమర్థిస్తున్నారు కూడా.  సమాజానికి, దేశానికి , ప్రపంచ సౌఖ్యానికి హానికారకం. పచ్చని, సుందరమైన వనం లాంటి మన భరతభూమిని జ్వాలలా కాల్చేస్తోంది తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణే.ఇది వినడానికి కఠినంగా ఉన్నా సరే కాదనలేని సత్యం. 
 
ఇలాంటి వ్యవహారాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారి అస్థిత్వానికే చేటు చేస్తారు వీరంతా. కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో తప్పును ప్రశ్నించగలవాళ్ళను కేవలం వేళ్ళమీద లెక్కబెట్టగలం. యువతలో ఇలాంటి వారు చాలా అరుదు. అలా అరుదుగా ఉన్న వారికి మిగతావారంతా కలసి ఇచ్చే బిరుదు “వెనకబడినవారు”; “నాగరికత ఎరుగనివారు”; “వయసుడికిపోయినవారు”. శ్రీశ్రీ చెప్పింది మరిచారేమో.. వయసుడికింది, ఎముకల్లో సత్తువలేనిది ఆ కొందరికి కాదు. అధిక సంఖ్యలో ఉండి మత్తులో మునుగుతూ అల్లరి చేస్తూ మసలే యువతీ యువకుల గురించి. ముందే ఊహించేశారు ఆ మహాకవి నేటి పరిస్థితి గురించి..!!
 
తలెత్తుకు తిరగాల్సిన “భారతం” తలవంచుకునే పరిస్థితికి చేరకుండా ఉండాలంటే నిద్రలో ఉన్న మన సమాజం మేల్కోవాలి. తప్పు అనిపిస్తే ప్రశ్నించాలి. అంతే కాదు అందరూ ధర్మం ఏదో అధర్మమేదో; మంచేదో చెడేదో; సత్యమేదో అసత్యమేదో; చేయవలసినది ఏదో ఏది చేయదగినది కాదో తెలుసుకుని దేశమంటే భక్తి అలవరచుకుంటూ అంతర్జాలంలో బతికే యువత బాహ్యప్రపంచంలో తమ అడుగులు మోపి, బాధ్యతాయుతంగా, కర్తవ్యనిష్ఠ కలిగి ముందుకు అడుగులు వేసినప్పుడే మన భారత దేశం ప్రపంచంలో అన్నిటా అగ్రగామి అవుతుంది. లేదా స్వాతంత్ర్యం ఉన్నా విదేశీయులకు మరలా పాదాక్రాంతం అవుతుంది. 
 
శిఖరాన ఉండాలి మన భావిభారతం..!! 
దాన్ని అథః పాతాళానికి చేర్చకండి..!!

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!