3ఏళ్లుగా గణతంత్ర వేడుకల్లో.. ప్రాతినిధ్యానికి నోచుకోని తెలుగు రాష్ట్రాలు:

గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరుతున్న పెరేడ్లో దాదాపు అన్నిరాష్ట్రాలూ తమ తమ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రూపొందించిన శకటాలను ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది.
కానీ అదేమి దురదృష్టమో .. గత మూడేళ్ళ నుండి తెలుగు రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక శకటాలు ఢిల్లీ పెరేడ్లో కనిపించడం మానేసాయి. కారణం?

తెలుగు రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక శకటాల నమూనాను గత 3 సంవత్సరాలుగా కేంద్ర డిఫెన్సు శాఖ తిరస్కరిస్తూ వస్తోంది. దీనికి వారు చెబుతున్న కారణాలు.. ఆ నమూనాల్లో ఉన్న భద్రతాపరమైన లోపాలు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండీ, అంటే గత నాలుగేళ్లలో ఇప్పటివరకూ మూడు సార్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిన సాంస్కృతిక శకటం నమూనా ఇదే కారణంతో మూడు సార్లు తిరస్కరణకు గురైంది.

గడిచిన నాలుగు సంవత్సరాల్లో 2015లో మాత్రమే ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఢిల్లీ పెరేడ్లో పాల్గొన్నాయి. ఆ అవకాశం కూడా తెలంగాణాకు అంత సులువుగా రాలేదు. బోనాలు, గోల్కొండ, పోతురాజుల నమూనాలు మొదటి దశలో ఎంపికైనప్పటికీ ఆ తరువాత సెర్మోనియల్ కమిటీ నుండి ఎటువంటి స్పందనా లేకపోయింది. అది ఎంపికైందో లేదో తెలియని పరిస్థితిల్లో వాటిని రూపొందించిన కళాకారులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తరువాత 15 రోజులకు కానీ సెర్మోనియల్ కమిటీ నుండి సమాధానం రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన ‘సంక్రాతి సంబరాలు’ నమూనా సులువుగానే ఎంపికైంది.

ఎంపిక విధానం ఏమిటి?

సహజంగా సాంస్కృతిక శకటాల నమూనా ఎంపిక ప్రక్రియ ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మొదలవుతుంది. సమాచార ప్రసార శాఖ అధికారుల సమావేశంలో రాష్ట్రాల మదిలో ఉన్న నమూనాకు సంబంధిచిన 3D ప్రెసెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఆమోదం పొందిన తరువాత ఆ నమూనాను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెర్మోనియల్ కమిటీకి పంపిస్తారు. ఇక దాన్ని ఎంపిక చేయాలా వద్దా అనేది కమిటీనే నిర్ణయించాల్సి ఉంటుంది.

ఈసారి రాష్ట్రంలో జరగనున్న ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’ వైభవాన్ని ప్రతిబింభించే రూపొందించిన నమూనాను కూడా కేంద్రం భద్రతా కారణాల పేరిట తిరస్కరించింది. దానికి స్థానంలో మరో కొత్త నమూనా పంపినప్పటికీ అదేవిధమైన తిరస్కరణ ఎదురవ్వడం పట్ల తెలంగాణ ప్రజలు తీవ్రనిరుత్సాహానికి గురయ్యారు.

సెర్మోనియల్ కమిటీపై విమర్శలు:

గడిచిన 10 సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే తెలుగు రాష్ట్రాల (సమైక్య ఆంధ్రప్రదేశ్ కలుపుకుని) నుండి పంపిన సాంస్కృతిక శకటం నమూనాను ప్రదర్శనకు ఎంపిక చేయడం పట్ల సెర్మోనియల్ కమిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు కమిటీని ప్రభావితం చేస్తున్నట్టు వినికిడి. నిజానికి రాష్ట్రాలు పంపే నమూనాలను నిర్మించే ప్రాజెక్టు కాంట్రాక్టర్లకే అప్పజెబుతారు.

ఈ సంవత్సరం కేవలం 15 రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక శకటాలు మాత్రమే పెరేడ్లో పాల్గొన్నాయి.

One thought on “3ఏళ్లుగా గణతంత్ర వేడుకల్లో.. ప్రాతినిధ్యానికి నోచుకోని తెలుగు రాష్ట్రాలు:

  • 30/01/2018 at 10:40 pm
    Permalink

    May be because of the number game. How many MPs we have and whether that count matters to the government or not. Or may be because we are not United enough.

    Reply

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!