గాంధీ హత్య వెనుక బ్రిటిష్ ఫోర్స్-136 హస్తం!! కొందరిని ‘ద్రోహులు’గా చూపేందుకు అప్పటి ప్రభుత్వం కుట్ర!?

పునర్విచారణ పిటిషన్లో ఆసక్తికర అంశాలు 

 

మహాత్మా గాంధీ హత్యపై పునర్విచారణ జరిపించి, అసలు దోషులు ఎవరో తేల్చాలంటూ అభినవ్ భారత్ సంస్థ వ్యవస్థాపకుడు పంకజ్ ఫడ్నవీస్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. 
 
గాంధీ హత్య ఒక కుట్రప్రకారం జరిగిందని, ఇందులో భాగంగానే నాథూరాం గాడ్సే ఆయన్ను హత్యచేశాడని సుప్రీమ్ కోర్టు ఆనాడు విశ్వసించింది. అతనితోపాటు కుట్రదారులుగా భావించి నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్టేలకు ఉరిశిక్ష, నాథూరామ్ గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సేతో సహా ఆరుగురికి జీవితకాలపు శిక్ష విధించింది. శిక్షలు అమలయ్యాయి. జీవితకాలపు శిక్ష పూర్తిచేసికుని బయటకు వచ్చిన గోపాల్ గాడ్సే కొంతకాలం జీవించి మరణించారు. 
 
గాంధీ హత్య విచారణ సందర్భంగా తాను ఎందుకు హత్యచేయవలసి వచ్చిందో వివరిస్తూ వాంగ్మూలాన్ని చాలాకాలం బయటకి రానీయకుండా దాచిపెట్టారు. ఇప్పుడు గాడ్సే వాదన బయటకువచ్చింది. హత్య తానే చేశానని అంగీకరించాడు. ఇప్పుడు మళ్ళీ పునర్విచారణ కోరాల్సిన అవసరం ఏమిటి?
 
70 ఏళ్ల తరువాత తిరిగి ఆ హత్యాఘటనను భారతీయుల కళ్ళముందు నిలపాల్సిన అవసరం ఉందా? ఇలాంటి ప్రశ్నతో సదరు పునర్విచారణ పిటిషన్ను నిర్ద్వంద్వముగా తోసిపుచ్చాల్సిన సుప్రీమ్ కోర్టు, విచారణకు స్వీకరించడమేమిటి?
పునర్విచారణ కోరుతూ పిటిషనర్ లేవనెత్తిన అంశాల్లో ఎంతోకొంత నిజం ఉంటుందని సుప్రీం భావిస్తోందా?  
 
ఇక్కడ పిటిషనర్ లేవనెత్తిన అంశాల్లో గాంధీ హత్యవెనుక బ్రిటిష్ రాణి కుట్ర ఉందన్నది ముఖ్యవిషయం. బ్రిటిష్ రాణి ఆధ్వర్యంలో పనిచేసే ఫోర్స్-136 అనే రహస్య పోలీస్ సంస్థ బ్రిటన్లో ఉండేది. ఇది నేటి సిఐఏ, కేజీబీ సంస్థల వంటిది. తమదేశాలకు అడ్డుగా నిలుస్తారని భావించే ఇతరదేశాల నాయకులను చంపించే పథకాలు విజయవంతంగా నిర్వహించిన చరిత్ర ఈ సంస్థలకుంది. 
 
అటువంటి బ్రిటిష్ ఫోర్స్-136 సుభాష్ చంద్రబోస్ హత్యకు కుట్రపన్నిందన్న అనుమానం ఉంది. గాంధీ హత్యలోను వారి పాత్ర ఉందన్నది తాజా సందేహం. 
 
గాంధీ హత్యకేసులో శిక్షపడిన నిందితుల్లో నాథూరామ్ గాడ్సే నేరాన్ని అంగీకరించి ఉరికి సిద్ధమన్నాడు. కానీ రెండవవాడైన నారాయణ్ ఆప్టే తన నేరాన్ని అంగీకరించక ప్రైవీ కౌన్సిల్ కు అప్పీల్ చేసుకున్నాడు. కానీ అతని అప్పీలు పరిగణలోకి తీసుకోక, మరో మూడు నెలల్లో ఏర్పడబోయే కొత్త రాజ్యాంగం కోసం వేచిచూడక నవంబర్ 15, 1949 నాడు ఉరితీయడం అప్పట్లో సంచలనం. 
 
నారాయణ్ ఆప్టే బ్రిటిష్ సైనికదళంలో పనిచేశాడు. అతను బ్రిటిష్ ఏజెంటుగా వ్యవహరించాడు అనేది నేటి అనుమానం. నాథూరామ్ గాడ్సే తన తుపాకీ నుండి 3 తూటాలు పేల్చాను అన్నాడు. కానీ గాంధీ శరీరం పైన 4 తూటాల గాయాలున్నాయని పోస్ట్-మార్టం నివేదికలో ఉందంటారు. 
 
గాంధీజీ హత్యవెనుకానున్న కుట్రను చేధించేందుకు నియమించిన కపూర్ కమిటీ కూడా ఈ విషయంలో ఇదిమిత్థంగా ఏదీ తేల్చలేదు. కానీ గాంధీ మీదకి నాలుగు తూటాలు వెళ్లాయంటున్నారు. నాలుగుసార్లు పేలుడు శబ్దం వచ్చిందని కొందరు మాత్రమే చెప్పారు. మిగిలినవాళ్లు నాల్గవ బులెట్ శబ్దం వినలేదన్నారు. ఏదేమైనా తొలి తూటా తగలగానే గాంధీ పడిపోవడం, చుట్టూ ఉన్నవారు షాక్ లోనికి వెళ్లడం సహజంగా జరిగివుంటుంది. ఆ గందరగోళంలో ఎన్ని తూటాలు పేలుతున్నాయని లెక్కగట్టే పరిస్థితిలో ఎవరూ ఉండే అవకాశమే లేదు. కానీ నాలుగు తూటా గాయాలున్నటు ఫోటోలో కనిపిస్తోంది. 
 
గాంధీ హత్యలో బ్రిటిష్ వారి కుట్ర ఉందనేందుకు సాక్ష్యంగా ఆయన హత్యకు ముందే బ్రిటిష్ వారు తయారుచేసిన సంతాప సందేశాన్ని పేర్కొంటున్నారు. లండన్ నుండి విదేశాల్లో ఉన్న అన్ని దౌత్య కార్యాలయాలకు ఈ సందేశం పంపబడింది. గాంధీ మరణవార్త విన్నవెంటనే ఎలాంటి సందేశం ఇవ్వాలనేది ఆ ఉత్తరం సారాంశం. అప్పటికి గాంధీ అనారోగ్యంతో లేరు, అంపశయ్యమీదా లేరు. అటువంటప్పుడు ‘గాంధీ మరణిస్తే ఇవ్వాల్సిన సంతాప సందేశం’ అనే ఆలోచన బ్రిటిష్ ప్రభుత్వానికి ఎందుకు కలిగింది? ఇదీ నేడు సుప్రీం కోర్టు ముందున్న అంశం. 
 
గాంధీ హత్య జరిగినరోజున అమెరికన్ దౌత్యవేత్త ఒకరు అక్కడ ఉన్నారు. తూటాలు పేల్చినా నాథూరాం గాడ్సేని పట్టుకోవడంలో అతడు సహకరించాడు. అతడు ఆ సమయంలో అక్కడ ఎందుకున్నాడు? 
 
హత్య ఘటనలో అమెరికన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం అతడి బాధ్యత. అందులో భాగంగా అతడు పంపిన నివేదికను అమెరికా ప్రభుత్వం “మా దేశ భద్రతావ్యవహారాల దృష్ట్యా బయటపెట్టలేం” అంటోది. నేటి వరకు బయటపెట్టలేదు. 
 
భారతదేశంలో ఏ పదవిలోనూ లేని గాంధీ హత్యకు, అమెరికా భద్రతకు సంబంధం ఏమిటి? ఏ విధంగా చుసినా గాంధీ హత్యలో జరిగిన కుట్రలో కొంతభాగమే బయటకు వచ్చినట్టు అనిపిస్తోంది. 
 
గాంధీ హత్యను ఆధారం చేసుకుని, కొందరు నాయకులను, సంస్థలను ‘ద్రోహులు’గా చూపే ప్రయత్నం భారత ప్రభుత్వం చేసిందా అనే సందేహం కలుగకమానదు. గాంధీ హత్య ఘటనపై వేసిన పిటిషన్ అంశంలో సహకరించమని సుప్రీం కోర్టు నియమించిన న్యాయవాది,  మాజీ సొలిసిటర్ జనరల్ అమరేంద్ర శరణ్.. ఈ కేసును తిరగదోడాల్సిన అవసరం లేదని కోర్టుకి స్పష్టం చేశారు. 
 
కాబట్టి ఇప్పటికైనా గాంధీ హత్యవిషయంలో అనవసరపు వివాదాలు పక్కనబెట్టి, ఆయన అనుసరించిన విధానం, నెలకొల్పిన విలువలను స్ఫూర్తిగా తీసుకంటే బాగుంటుంది. 

డా. దుగ్గరాజు శ్రీనివాసరావు

రచయిత ప్రముఖ రాజకీయ విశ్లేషకులు

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!