విదేశీ ప్రయాణాల్లో ప్రధానిని కలిసిన వారి వివరాలు తెలియజేయండి: ప్రధాని కార్యాలయానికి సూచించిన సమాచార కమిషన్

విదేశీ ప్రయాణాల్లో ప్రధాని నరేంద్ర మోడీ వెంట ఉన్న ప్రముఖులు, వ్యాపారవేత్తల వివరాలు తెలియజేయాలని కేంద్ర సమాచార కమిషన్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆదేశించింది. 
 
ప్రధాని చేసిన విదేశీ పర్యటనల్లో ఆయనను కలిసిన సీఈఓలు, వ్యాపారవేత్తల వివరాలు, అలా కలిసే వారిని ఎంపిక చేసే ప్రక్రియ తదితర వివరాలు కోరుతూ నీరజ్ శర్మ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న దరఖాస్తుకి సమాధానంగా ప్రధాని కార్యాలయం “భద్రతా కారణాల రీత్యా ఆ సమాచారం ఇవ్వడం కుదరదు” అని స్పష్టం చేసింది. 
 
వ్యక్తుల వివరాలు ఇవ్వకపోవడమే కాకుండా, ఎంపిక విధానం మీద కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో నీరజ్ శర్మ సెకండ్ అప్పీలుకు వెళ్లారు. ఈ వ్యవహారంపై ప్రధాని కార్యాలయం కావాలని తాత్సారం చేసింది అని, సమాచారం ఇవ్వని, లభ్యంకాని పక్షంలో తన దరఖాస్తుకు స్పందించకుండా అన్ని రోజులపాటు కాలయాపన చేయడాన్ని నీరజ్ ప్రశ్నించారు. 
 
ప్రధాని కార్యాలయం పొంతనలేని సమాధానం:
 
ఈ వ్యవహారంలో ప్రధాని కార్యాలయం వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. నీరజ్ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానంగా “ప్రధానిని కలిసేవారిని టీవీలో చూడవచ్చు, వారి పేర్లు మరుసటిరోజు వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవచ్చు” అని సమాధానమిచ్చింది. టీవీల్లో చూసి, పేపర్లలో పేర్లు తెలుసుకున్నాక ఇక భద్రతా కారణాలు ఏముంటాయి అని నీరజ్ ప్రశ్నిస్తున్నారు. ప్రధానిని కలిసేందుకు వచ్చే ప్రయివేట్ వ్యక్తుల కోసం చేసే ఏర్పాట్ల వ్యయం ప్రజాధనం నుండే అవుతుంది కాబట్టి వారి వివరాలు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వాలని చేసిన వాదనకు కమిషన్ పైవిధంగా స్పందించిది. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!