రాహుల్‌ సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్‌ ఓడిపోయింది.. అతను తెలంగాణకు చేసేదేమీ: మంత్రి కేటీఆర్

రాహుల్‌గాంధీ సొంత నియోజకవర్గంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలయిందని, అలాంటి వ్యక్తి తెలంగాణకు వచ్చి చేసేదేమీ లేదని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు.
 
రాష్ట్రంలో 2019 సాధారణ ఎన్నికల్లో తెరాస మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని,  కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాలు విసిరారు. బుధవారం గద్వాల పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్‌ అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.2019 ఎన్నికల జైత్రయాత్ర గద్వాల నుంచే ప్రారంభమైందన్నారు. ఇది తెలంగాణ మొత్తం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 50 ఏళ్ల పాలనను తరచి చూసుకోవాలని హితవు పలికారు.
 
 
నల్గొండ జిల్లాలో 2 లక్షల మంది ఫ్లోరైడ్‌తో బాధపడుతుంటే వారికి మంచినీళ్లు కూడా ఇవ్వలేని దద్దమ్మలని కాంగ్రెస్‌ నేతలను ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు రాకుండా పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టింది కాంగ్రెస్‌ పార్టీయేనని,  ఇక్కడున్న 14 నియోజకవర్గాల ప్రజలు ఈ చేదు నిజాన్ని ఒప్పుకోవాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లలో ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మూడున్నరేళ్ల తెరాస పాలనలో 5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని, అయిదేళ్లలో మొత్తం 8 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఆర్డీఎస్‌ నుంచి ఈ నలభై ఏళ్లలో ఏనాడన్నా సాగునీరు వచ్చిందా అని ప్రశ్నించారు. నడిగడ్డలో కేసీఆర్‌ పాదయాత్ర చేసినప్పుడే తుమ్మిళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, అందులో భాగంగా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి పనులు జరుగుతున్నాయని చెప్పారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!