టీటీడి చైర్మన్ గా పుట్టా నియామకం ఖరారంటూ వార్తలు.. వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు 

 
 
తాజాగా పుట్టా సుధాకర్ యాదవ్  టీటీడి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. ఇప్పటికే ఏపీలో బీజేపీ-టీడీపీ మధ్యనున్న విబేధాలు రచ్చకెక్కుతున్న సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ నియామక ఖరారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన కధనం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.  
 
నిజానికి పుట్టా సుధాకర్ యాదవ్ ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించాలన్న తెలుగుదేశం నిర్ణయాన్ని బీజేపీ మొదటినుండి వ్యతిరేకిస్తూ వస్తోంది. అతడు గతంలో టిటిడి బోర్డు సభ్యుడి హోదాలో ఉండి కూడా క్రైస్తవ కూటములకు హాజరవ్వడం ఇందుకు కారణం. క్రైస్తవ కూటములకు మద్దతిచ్చే వ్యక్తికి హిందూ ధార్మిక సంస్థ ఐన  తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి ఎలా కట్టబెడతారంటూ బీజేపీ ప్రశ్నించడం, దీనికి తోడు ఆరెస్సెస్ కూడా ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తితో వ్యక్తం చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరెస్సెస్ అధికారికంగా ప్రభుత్వ వ్యవహారాల్లో కలుగజేసుకోకపోయినప్పటికీ, ఒకవేళ పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం జరిగిన పక్షంలో వెంటనే రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర ఎండోమెంట్స్ శాఖ మంత్రి మాణిక్యాలరావుకు సూచించినట్టుగా ప్రచారం జరుగింది. అంతేకాకుండా తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. దీంతో నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆ సమయంలో సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు పేరు తెరమీదకు వచ్చింది. ఇక కాబోయే బోర్డు చైర్మన్ అతడే అంటూ మరొక ప్రచారం జరిగింది. దాదాపు ఇంతటితో ముగిసిపోతుంది అని అనుకునే సందర్భంలో, ఇరుపార్టీల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా పుట్టా సుధాకర్ యాదవ్ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా రాజకీయ దురుద్దేశాలతో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందంటూ అనేక విమర్శలు వస్తున్నాయి. 
 
అత్తమీద కోపం దుత్త మీద చూపించినట్టు, బిజెపీ మీద ఉన్న కోపం హిందువుల మీద  చూపి, హిందూ దేవాలయాలను రాజకీయాల్లోకి లాగడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  
 
ఇప్పటికే ఆందోళనకు సిద్ధపడిన తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఇప్పడు ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తుందో అని హిందువులు ఎదురుచూస్తున్నారు. రాజకీయంగా మంత్రి మాణిక్యాలరావు రాజీనామా చేస్తారా లేదా అనేది కోటి రూపాయల ప్రశ్న. ఒకవేళ రాజీనామా చేయకుండా సంకీర్ణ ధర్మం పాటిస్తే మాత్రం హిందువుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!