పాట పాడనందుకు గాయని దారుణ హత్య: పాకిస్థాన్ లో ఘటన

ఇస్లామాబాద్‌: పాట పాడనందుకుగానూ ఓ పాకిస్థానీ గాయనిని దారుణంగా కాల్చి చంపేశారు. పాకిస్థాన్‌లోని మర్దన్ ప్రాంతానికి చెందిన నయీమ్‌ ఖత్తక్‌ అనే వ్యక్తి శనివారం రాత్రి తన ఇంట్లో పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీలో కచేరీ ప్రదర్శన ఇవ్వాల్సిందిగా గాయని సుంబుల్‌ ఖాన్‌(25)ను ఆహ్వానించాడు. కానీ ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. సెలబ్రిటీల పార్టీల్లో పాడతాను కానీ సాధారణ ప్రజల ఇంటికి వచ్చి పాడలేనని చెప్పింది.

దాంతో ఆగ్రహించిన నయీమ్‌ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సుంబుల్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెను కిడ్నాప్‌ చేసి బలవంతంగా కచేరీలో పాల్గొనేలా చేయాలని పథకం రచించాడు. కానీ ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. దాంతో సుంబుల్‌ అక్కడికక్కడే చనిపోయింది.

దాడి అనంతరం నిందితులు పారిపోయారు. ప్రధాన నిందితుడైన నయీమ్‌ మాజీ పోలీసు అధికారిగా గుర్తించారు. అతన్ని అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నో పాకిస్థానీ టీవీ షోలలో సుంబుల్‌ పాల్గొందని.. ఆమెకు మంచి పేరుందని పోలీసులు పేర్కొన్నారు.

పాకిస్థాన్‌లో  కళాకారులపై గతంలోనూ ఇలాంటి దాడులు చాలానే జరిగాయి. గతేడాది లాహోర్‌కు చెందిన ప్రముఖ నటి, డ్యాన్సర్‌ కిస్మత్‌ బైగ్‌ను కూడా కొందరు దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేశారు.

 

ఆధారం: www.eenadu.net

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!