మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎంకౌంటర్ కేసులో కీలక మలుపు

ఆదిలాబాద్‌: మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజకుమార్ ఎన్‌కౌంటర్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆదిలాబాద్‌ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు గురువారం కొట్టివేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించింది.
 
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీప్రాంతంలో 2010 జూలై 1న జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఆజాద్ సహా జర్నలిస్ట్ హేమచంద్రపాండే హతమయ్యారు. తన భర్తను బూటకపు ఎన్‌కౌంటర్‌తో హత్య చేశారని, ఇందులో పాల్గొన్న 29 మంది పోలీసులపై విచారణ చేపట్టాలని ఆజాద్ భార్య పద్మ  2013 జూలై 2న కోర్టులో ప్రొటెక్ట్ పిటిషన్‌ వేశారు. రెండేళ్ల అనంతరం పోలీసులను విచారించడం వీలుకాదంటూ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె ఎగువ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజా తీర్పు పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
 
నమ్మకం పెరిగింది: పద్మ
ఆదిలాబాద్ జిల్లా కోర్టు తీర్పు సంతోషాన్నిచ్చిందని, న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడిందని ఆజాద్ భార్య పద్మ వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!