ఆహారపదార్ధాలు కల్తీ చేస్తే పీడీ యాక్ట్:  మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరిక  

కల్తీ ఆహార పదార్థాల నివారణకు సమైక్యంగా కృషి చేద్దామని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఆహార పదార్థాల్లో కల్తీలపై ప్రజల్లో అవగాహన కల్గించేందుకు, కల్తీలకు పాల్పడుతున్న హోటళ్ల యజమానులను హెచ్చరించేందుకు  లక్ష్మారెడ్డి  స్వయంగా రంగంలోకి దిగారు.  హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారాన్ని పరీక్షించే సంచార వాహనంతో సహా పర్యటించి, పలు హోటళ్లు, బేకరీల్లో తనిఖీలు చేయించారు. ఒక బేకరీ దగ్గర ఆగిన మంత్రి.. మీకు బేకరీ నిర్వహించడానికి పర్మిషన్ ఉందా? ఈ బ్రెడ్, బేకరీ పదార్థాలు మీరే తయారుచేస్తారా? ఎక్కడి నుంచి తెస్తారు? మిగిలితే ఏం చేస్తారు? పాచివి కూడా అమ్మేస్తున్నారా? ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి యజమాని తడబడుతూ.. సార్.. ఈ మధ్యే ఈ దుకాణాన్ని తీసుకున్నాను అనగానే మంత్రి స్పందిస్తూ ఇలాంటి వాటిని పరిశీలించాలని, కల్తీని నివారించాలని అధికారులకు సూచించారు.

హోటళ్లు, బేకరీల తనిఖీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కల్తీని గుర్తించే పద్ధతులను తెలుసుకోవాలని, నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. ప్రజారోగ్యంతో ఎవరైనా ఆటలాడితే సహించేది లేదన్నారు. కల్తీ నివారణకు పటిష్టమైన చట్టాలు చేస్తున్నామని చెప్పారు. కల్తీపై ముందుగా ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పిస్తామన్నారు. హోటళ్లకు గ్రేడింగ్ ఇవ్వాలని యోచిస్తున్నామని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట ఐపీఎం డైరెక్టర్ శంకర్, ఆహార తనిఖీ అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!