ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులు: మంత్రి కేటీఆర్‌

రంగారెడ్డి: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులుగా మారారని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం పర్యటించిన కేటీఆర్ వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం తుర్కయాంజాల్‌లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎం.కిషన్‌రెడ్డి, అధ్యక్షతన జరిగిన సభలో భువనగిరి ఎంపీ బూరనర్సయ్యగౌడ్‌, రాజేంద్రనగర్‌, మహేశ్వరం ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్‌, తీగల కృష్ణారెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. కేంద్రం నుంచి ఎవరొచ్చినా రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలను కొనియాడుతుంటే.. ఇక్కడి కాంగ్రెస్‌ నేతలకు అవి కనిపించకపోవడం బాధాకరమన్నారు. వచ్చే మే నెల నుంచి రైతులకు పెట్టుబడి కోసం ప్రభుత్వం ఎకరాకు రూ.4వేలు అందజేస్తుందన్నారు. దీనికోసం ఏడాదికి రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 65 ఏళ్లు తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్‌ నేతలు.. నేడు కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కరవుతో అల్లాడే ఇబ్రహీంపట్నం ప్రాంతానికి పాలమూరు-ఎత్తిపోతల ద్వారా నీరందించి సస్యశ్యామలం చేద్దామంటే నల్గొండకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు కేసు వేసి అడ్డుపడుతున్నారన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని భాజపా నాయకులకు మంత్రి సూచించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగరకలాన్‌కు దుబాయ్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ రానున్నట్లు ప్రకటించారు. అనంతరం మంత్రి సమక్షంలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఎగుమతుల్లో దేశంలోనే అయిదో స్థానంలో నిలిచిందన్నారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.857 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!