కాపు రిజర్వేషన్లు – కథా కమామీషు (2వ భాగం)

ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయశాస్త్రం చూద్దాం. ఆర్టికల్ 16లోనే ‘రాజ్యం’ (state) వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు ఇవ్వొచ్చు అని ఉంది.

ఇక్కడ ‘state’ అనే పదం ఆర్టికల్ 12 లో నిర్వచించినట్లే అర్ధం చేసుకోవాలి. కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలూ, ప్రభుత్వ అదుపు అజమాయిషీలో ఉండే ఇతర సంస్థలూ ‘state’ నిర్వచనంలోకే వస్తాయి. అంటే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రప్రభుత్వం తాలూకా అనుమతి అక్కర లేకుండా backward classes కి రిజర్వేషన్లు కల్పించవచ్చు.

అయితే M R బాలాజీ Vs మైసూర్ ప్రభుత్వం (1963) అనే కేసులో సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతరులను కలిపి) మొత్తం ఖాళీలలో 50 శాతం మించడానికి వీల్లేదని చెప్పేరు.

1980లో మండల్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును పురస్కరించుకుని 1990లో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకి సంబంధించి ఒక ఆఫీస్ మెమొరాండం ఇచ్చింది. దాని ప్రకారం 27 శాతం ఉద్యోగాలు SEBC (Socially and Economically Backward Classes)కి రిజర్వు చేయబడ్డాయి. ఇది కాక 10 శాతం, ఇతరత్రా రిజర్వేషన్లు లేకుండా, కేవలం ఆర్ధికంగా వెనుకబడిన వాళ్లకు మాత్రం రిజర్వేషన్లులు కల్పిస్తూ 1991లో ఒక ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవి చట్టాలు కాదు. కేవలం ఆఫీస్ మెమోలు మాత్రమే. అంటే Executive Orders.

పై ఆర్డర్లని కొందరు కోర్టులో సవాల్ చేసేరు. అంతిమంగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. Indira Sahani & Others VS Union of India & others AIR 1993 SC 477 కేసులో రాజ్యాంగం తాలూకా ఒక ప్రాథమిక లక్షణం (Basic Feature) అనదగ్గ ప్రాధమిక హక్కుకి (సమానత్వపు హక్కు) సంబందించిన విషయం ఇమిడి ఉండడంతో సుప్రీంకోర్టు, తీర్పు చెప్పడానికి 9 మంది న్యాయమూర్తుల బెంచ్ ఏర్పాటు చేసింది.

ఈ క్రింది మూడు ప్రశ్నలూ కోర్టుముందు ప్రాముఖ్యత వహించాయి:

1) ప్రభుత్వాలు చట్టాలు చెయ్యకుండా executive ఆర్డర్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించవచ్చా?

2) 1963 లో బాలాజీ కేసులో 50 శాతం పరిమితి దాటకూడదన్న తీర్పు సరి అయినదేనా?

3) కేవలం ఆర్ధిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ కల్పించవచ్చా?

వీటికి సుప్రీంకోర్టు ఇచ్చిన జవాబులు తరవాత చూద్దాం.

.. మరొక రాజ్యాంగ సంబంధించిన విషయం కూడ ముఖ్యమైనది ఒకటుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన కొత్తల్లోనే భూసంస్కరణలకు సంబంధించిన చట్టాలు కొన్ని కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలూ చేసేయి. పెద్ద భూస్వాముల నుండి భూములు ప్రజాప్రయోజనాల గురించి తీసుకుంటే, వాళ్లు వాళ్ళ ఆస్తి హక్కుకు (అప్పుడు ప్రాధమిక హక్కు) భంగం అనీ, చట్టాలు చెల్లవనీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. దాన్ని నిరోధించడానికి మొదటి రాజ్యాంగ సవరణ చేసేరు. 9th షెడ్యూల్ కొత్తగా పెట్టి, అందులో కొన్ని చట్టాల పేర్లు రాసి, ఆర్టికల్ 31B ప్రకారం తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చిన చట్టాలను ఏ కోర్టూ ఏ కారణంగానూ చెల్లవు అని ప్రకటించడానికి వీలు లేదు అన్నారు. కొత్తగా ఎదైనా చట్టం చేసినా అది 9th షెడ్యూల్ లో చేర్చవచ్చు అని పార్లమెంట్ అభిప్రాయం.

(సశేషం..)

మొదటి భాగం లింకు 

వృద్ధుల కళ్యాణ రామారావు

రచయిత సామాజిక విశ్లేషకులు, సీనియర్ న్యాయవాది

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!