ఛత్తీస్‌గఢ్‌లో హోరాహోరీ కాల్పులు.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతో సహా ఐదుగురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పరిధిలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆదివారం రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవడంతోపాటు అడ్డువచ్చిన సూపర్‌వైజర్‌ను అతి కిరాతకంగా చంపేశారు. అక్కడ ఉన్న ఒక జేసీబీ, మరొక ట్రాక్టర్‌తోపాటు 12 వాహనాలకు నిప్పు పెట్టారు. నక్సల్స్‌ను అడ్డుకునేందుకు అక్కడకు పోలీసులు రావడంతో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పౌరులు, ఒక మావోయిస్టు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుక్మా జిల్లా బెజ్జి – చింతగుఫా మార్గంలో సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాల భద్రత మధ్య రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. 

ఈ పనులను అడ్డుకునేందుకు బెజ్జి వద్దకు మధ్యాహ్నం 11 గంటల సమయంలో చేరుకున్న మావోయిస్టులు, సూపర్‌వైజర్‌ను చంపేసి విధ్వంసానికి పాల్పడి అడవిలోకి వెళుతుండగా సీఆర్పీఎఫ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం ఎదురైంది. మధ్యా హ్నం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇరు పక్షాల మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పది మంది జవాన్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించినట్లు నక్సల్స్ వ్యతిరేక విభాగం స్పెషల్ డీజీ డీఎం అవస్థి తెలిపారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడిన వారిలో సోరి భూషా రెండు కాళ్లకు.. రాకేశ్ రెండు చేతులకు, ఎస్. రాజా కాలుకు, చేతికి, పాదం సక్‌కు భూజాల్లో, శివరాంకు కడుపులో, ఆర్ పాయంకు వెన్నులో బుల్లెట్ గాయాలయ్యాయి. 
మృతి చెందిన జవాన్లు మడకం హంద, ముఖేశ్ కడ్తిగా గుర్తించారు. 20 మందికి పైగా మావోయిస్టులు గాయపడ్డారని తెలుస్తున్నది. ఎన్‌కౌంటర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించడం పట్ల ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా మావోయిస్టులు చింతగుఫా రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకునేందుకు భారీగా వచ్చి జరిపిన కాల్పుల్లో సుమారు 25మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ర్టాల సరిహద్దుల్లోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. సరిహద్దుల్లోని ఆరు సీఆర్పీఎఫ్, ఇతర పోలీసు బలగాల క్యాంపులను అప్రమత్తం చేశారు. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని భద్రాచలం ఏఎస్పీ సునీల్‌దత్ తెలిపారు.

 

source

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!