వీధిబాలల పరిస్థితికి కరిగిపోయిన చిన్నారి హృదయం.. కేటీఆర్ కు లేఖ.. వెంటనే స్పందించిన మంత్రి

ఆరేళ్ళ పసిపాప.. తాను పొదుపుగా దాచుకున్న డబ్బును వీధిబాలల సంక్షేమం కోసం ఖర్చు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ విషయమై మంత్రి కేటీఆర్ కి లేఖ కూడా రాసింది. మంత్రి కూడా వెనువెంటనే స్పందించారు. 
వివరాల్లోకి వెళితే.. 
 
హైదరాబాద్ ఆల్వాల్ ప్రాంతానికి చెందిన కర్నాటి నాగేశ్వరరావు, పావనిల ముద్దుల కూతురు సుప్రియ స్థానిక సెయింట్ పయస్ స్కూలులో 1వ తరగతి చదువుతోంది. తల్లితండ్రులతో కలిసి ఇటీవల పుస్తకాల దుకాణానికి వెళ్లి వస్తుండగా సుచిత్ర జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సంచరిస్తున్న వీధిబాలలను చూసింది. వారు కూడా తనలాగా ఎందుకు చదువుకోవట్లేదు అని తల్లిదండ్రులను ప్రశ్నించడంతో వాళ్లకు సరైన ఆదరణ లేకపోవడం వల్లే అని తల్లిదండ్రులు సమాధానపరిచారు. అంతటితో ఆ పసిమనస్సు ఆ సంఘటన అంత సులభంగా మర్చపోలేదు. ఇంటికి వెళ్ళాక కూడా అవే ఆలోచనలతో.. “మనం వాళ్లకి సహాయం చేయగలమా డాడీ” అని అడగంతో, కొంతమందికి మనం సహాయం చేయగలము.. కానీ కేటీఆర్ అంకుల్ కి మెస్సేజ్ పంపితే అందరికీ సహాయం అందుతుంది అని సమాధానం ఇచ్చారు.
 
దీంతో సుప్రియకు మహత్తరమైన ఆలోచన వచ్చింది.. మెస్సేజ్ కాదు అని చెప్పి తన చిట్టి చేతులతో మంత్రి కేటీఆర్ కి ఉత్తరం రాసి తన తండ్రి ట్విట్టర్ అకౌంట్ ద్వారా మంత్రికి ట్వీట్ చేసింది.
 
 
ఆ ఉత్తరం సారాంశం ఇదీ:
 
ప్రియమైన కేటీఆర్ అంకుల్.. 
దయచేసి సుచిత్ర జంక్షన్ వద్దనున్న వీధి బాలలకు కావలసిన ఆహారం, వసతి మరియు చదువు వంటి సదుపాయాలు కల్పించండి. ఇందుకోసం నా వంతు సహాయంగా నేను కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.2000 మీకు అందివ్వాలనుకుంటున్నాను” 
 
దీంతో వెనువెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ చిన్నారి పెద్దమనసుని మెచ్చుకుంటూ తన లేఖకు ట్విట్టర్ ద్వారా స్పందించారు. వెంటనే తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!