కాపు రిజర్వేషన్లు – కథా కమామీషు (4వ భాగం)

తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్లు 69 శాతం వరకు చేరుకున్నాయి. ఆ రాష్ట్ర శాసనసభ దానికోసం ఒక చట్టం చేసింది. 
 
అయితే 1963 లో బాలాజీ కేసులో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటితే ఆర్టికల్ 14 సమానత్వపు హక్కుకి వ్యతిరేకం కాబట్టి అది చెల్లదు అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి తమిళనాడు చట్టం కోర్టులో సవాల్ చేస్తే రాజ్యాంగ విరుద్ధం అని కొట్టేస్తారు. అంచేత ఆ చట్టాన్ని రక్షించుకోవాలంటే రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 లో పెట్టడం ఒక్కటే మార్గం అని తమిళనాడు ప్రభుత్వం భావించింది. 
 
షెడ్యూల్ 9 లో పెట్టాలంటే పార్లమెంట్ మాత్రమే చెయ్యగలదు. అంచేత తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఆ చట్టాన్ని పంపింది. కేంద్రప్రభుత్వం దాన్ని ఆమోదించి షెడ్యూల్ 9 లో చేర్చేలా చేసింది. ఇలా షెడ్యూల్ లో చేర్చడం 24 ఏప్రిల్ 1973 తరవాత జరిగింది. 
 
అలా చేర్చిన చట్టాన్ని, ఆర్టికల్ 14 ప్రాధమిక హక్కుకు మాత్రమే కాకుండా రాజ్యాంగం తాలూకా మౌలిక స్వభావానికి (basic structure) వ్యతిరేకం అనీ , దాన్ని కోర్టులో ఒకరు ఛాలెంజ్ చేసేరు.
 
వామనరావు కేసులో (1981) సుప్రీంకోర్టు 5 గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి,  ఈ చట్టంతో బాటు 24 ఏప్రిల్ 1973 తరవాత  9 వ షెడ్యూల్ లో చేర్చిన మరికొన్ని చట్టాల రాజ్యాంగ బద్ధతని నిర్ణయించే హక్కు ఏ కోర్టుకేనా ఉంటుందా అనే అనుమానం వచ్చింది. దాన్ని 9 మంది ధర్మాసనానికి నివేదించేరు. 
 
ఆ ప్రశ్నకే  9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం 2007 లో I R Coelho కేసులో సమాధానం ఇచ్చేరు.
 
రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ మరొక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. Art 31B ప్రకారం షెడ్యూల్ 9 లో చేర్చిన చట్టాలను న్యాయసమీక్ష చేసే హక్కు(right of Judicial review) సుప్రీంకోర్టుతో సహా ఏ  కోర్టుకీ ఉండదు. ఇప్పుడు I R Coelho కేసులో  సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఈ రాజ్యాంగ సవరణ చెల్లుతుందా అన్న విషయం మీద అభిప్రాయం ప్రకటించాలి.
 
సుప్రీంకోర్టు తీర్పు చెపుతూ, Judicial Review Power రాజ్యాంగం తాలూకా మౌలిక అంశములలో (basic features) ఒకటని కేశవానంద భారతి కేసులో 24 ఏప్రిల్ 1973 లో 13 మంది ధర్మాసనం 7 : 6 మెజారిటీతో తీర్పు చెప్పింది కాబట్టి, షెడ్యూల్ 9 లో చేర్చిన చట్టాలను కూడా judicial review చెయ్యవచ్చనీ , అలా చెయ్యడానికి వీల్లేదన్న మొదటి రాజ్యాంగ సవరణ చెల్లదన్నారు.
 
అయితే ఆ న్యాయసమీక్ష ఈ కింది రెండు విషయాలకే పరిమితం అయి ఉంటుంది:
 
1) 9 వ షెడ్యూల్ లో చేర్చిన చట్టము ప్రాధమిక హక్కులకు వ్యతిరేకమా అని  చూడాలి. 
 
2) ఒకవేళ అలా వ్యతిరేకం అయితే, అది రాజ్యాంగం తాలూకా మౌలిక అంశాలకి కూడా వ్యతిరేకమా అని చూడాలి.
 
పై రెండు ప్రశ్న్లకు సమాధానం ‘అవును’ అని వస్తే, ఆ చట్టం 9 వ షెడ్యూల్ లో చేర్చినది అయినా రాజ్యాంగ విరుద్ధం అనీ, చెల్లదని ప్రకటించవచ్చు.
 
(సశేషం..)
 
మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం 

వృద్ధుల కళ్యాణ రామారావు

రచయిత సామాజిక విశ్లేషకులు, సీనియర్ న్యాయవాది

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!