పతనానికి చేరువలో ఆమ్ ఆద్మీ పార్టీ? 

అన్నా హజారే చేపట్టిన అవినీతిపై యుద్ధం సహాయంతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పుడు పతనావస్థలో ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజంలోని అవినీతిని పెకిలించేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తన సొంత పార్టీ సభ్యుల అవినీతి అరాచకాలను మాత్రం అడ్డుకోలేకపోయాడు. ఎన్నో అంచనాలతో తమని ఎన్నుకున్న ప్రజల ఆశలు, అంచనాలు పూర్తిగా తారుమారు చేసేసింది ఆప్. 
 
అధికారంలోకి వచ్చిన ఆరంభం నుండే ఆప్ నేతల అవినీతి బయటపడుతూ వచ్చింది. తన సంస్థకు భారీగా వచ్చిన విరాళాలు దుర్వినియోగం చేశాడంటూ అరవింద్ కేజ్రీవాల్ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత అనేక అవినీతి వ్యవహారాల్లో ఆప్ ఎమ్మెల్యేలు, కార్యకర్తల పాత్రలు బయటపడ్డాయి. 
 
2016లో ఆప్ ఎమ్మెల్యే సందీప్ కుమార్ రాసలీలల వ్యవహారం ఆప్ పతనానికి నాంది పలికింది. ఆ ఘటనలో అరెస్ట్ అయిన సందీప్ కుమార్ ఇప్పటికీ జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అనంతరం ఆప్ మరో ఎమ్మెల్యే సోమనాథ్ భారతి భార్యను వేధించి, గాయపరచిన కేసులో అరెస్ట్ అయ్యాడు. తరువాతి ఘటనలో ఆప్ మీడియా సెల్ ఇంఛార్జి అంకిత్ లాల్ మీద కూడా భార్యను వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అంకిత్ భార్య ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ నే కారణంగా పేర్కొంది. 
 
జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై దృష్టి నిలిపి పార్టీని సంస్కరించుకోవాల్సింది పోయి కేజ్రీవాల్.. వాళ్ళ పార్టీ సభ్యులు పాల్పడిన ప్రతి అవినీతి, అక్రమాలకు ప్రధాని మోదీని కారణంగా చూపించాలని ప్రయత్నిస్తూ వచ్చాడు. ఇదే కాకుండా గత సంవత్సరం ఢిల్లీలో అంటువ్యాధులు ప్రబలిన సమయంలో కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇద్దరూ ప్రజలకు అందుబాటులో ఉండకుండా విదేశీ టూర్లకు వెళ్లారు. దీంతో ఢిల్లీ ప్రజల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఫలితం.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దారుణ ఓటమి. 
 
అప్పటికీ కేజ్రీవాల్ వైఖరిలో మార్పు రాలేదు. ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ ద్వారా రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడటం వల్ల 21 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారు. 
 
ఇప్పుడు తాజాగా ఆప్ ఎమ్మెల్యేల గూండాయిజం. గూండాలే తలదించుకునే రీతిలో.. టీవీ ప్రచారానికి నిధులివ్వలేదంటూ ఏకంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మీదనే దాడికి పాల్పడే పరిస్థితికి దిగజారారు. అదీ సాక్షాత్తు కేజ్రీవాల్ సమక్షంలోనే. ఈ వ్యవహారంలో ఆప్ ఎమ్మెల్యేలు అమనతుల్లాహ్ ఖాన్ మరియు ప్రకాశ్ జర్వాల్ అరెస్ట్ అయ్యారు. 
 
రాజ్యాంగం మీద కనీస గౌరవం లేకుండా ఇన్ని అవినీతి అరాచకాలకు పాల్పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ప్రజాస్వామ్య దేశంలోని ప్రభుత్వాన్ని నడిపించే నైతిక హక్కు ఉందా? దీని ఫలితం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుంది. ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ‘అవినీతి చరిత్ర’గా చెప్పుకుంటారు.

@AS_Santosh

రచయిత సామాజిక, మానవ హక్కుల కార్యకర్త

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!