“టీచర్లు తుపాకులు చేతబట్టాలి”: ఈ ఐడియా ఎవరిదో చూడండి

వాషింగ్టన్‌: ఇటీవల ఫ్లోరిడా పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన వారితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశమయ్యారు. గత వారం పాఠశాలకు చెందిన ఓ మాజీ విద్యార్థి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ  నేపథ్యంలో ట్రంప్‌ బాధితులతో శ్వేతసౌధంలో సమావేశమై మాట్లాడారు. తుపాకుల యజమానులకు నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని, తుపాకుల జారీకి పక్కాగా నిబంధనలను అమలుచేస్తామని ట్రంప్‌ హామీ ఇచ్చారు. వారి మానసిక పరిస్థితిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు.

పాఠశాలల్లో తరచూ ఇలాంటి కాల్పులు జరగకుండా ట్రంప్‌ ఓ ఐడియా ఇచ్చారు. స్కూల్లో టీచర్ల వద్ద కూడా తుపాకులు ఉండాలని ఆయన సూచించారు. కొందరు ఉపాధ్యాయులకు తుపాకుల వినియోగంలో మంచి శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే అది రహస్యంగా ఉండాలని చెప్పారు. కొందరు ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇచ్చి వారి దగ్గర రహస్యంగా తుపాకులు ఉంచితే..  పరిస్థితిలో కొంత మేర మార్పు వస్తుందని ట్రంప్‌ ఆశించారు.  దీని వల్ల గన్‌-ఫ్రీ జోన్‌ ఉండబోదని, అయితే గన్-ఫ్రీ జోన్‌ అంటే దుండగులు తుపాకులతో వచ్చి కాల్పులు జరుపుతున్నారని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటానని ట్రంప్‌ హామీ ఇచ్చారు.

కాల్పుల ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు విద్యార్థులు తమ ఆవేదనను అధ్యక్షుడితో పంచుకున్నారు. ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఇలాంటి పరిస్థితి  ఎదురుకావొద్దని ఒకరు, స్కూల్‌ నుంచి ప్రాణాలతో ఇంటికెళ్లగలిగినందుకు తాను చాలా అదృష్టవంతుడినని మరొకరు అన్నారు. విమానాశ్రయానికి వెళ్తే.. ఓ బాటిల్‌ నీళ్లతో విమానం కూడా ఎక్కలేం. అలాంటిది మృగాలు తుపాకులు పట్టుకుని దర్జాగా స్కూల్లోకి వచ్చేస్తున్నాయంటూ ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు.

 

source

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!